పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మహిళా జడ్జి జేబా చౌదరి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు ఈ వారెంట్ జారీ అయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఖాతూన్ జడ్జి జేబా చౌదరిని ఖాన్ బెదిరించిన కేసులో కోర్టు ఈ చర్య తీసుకుందని వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ సోమవారం కోర్టులో హాజరు కావలసి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగతంగా తనను హాజరీ నుంచి మినహాయించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 29 న కోర్టులో ఆయనను హాజరు పరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టులో తన స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్ కి సంఘీభావంగా ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల కస్టడీలో గిల్ ని టార్చర్ పెడుతున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు.
ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో.. జడ్జ్ జేబా చౌదరిని బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ఆమెపై తాను చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆ నాడే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
ఆ తరువాత తాను బహుశా తన పరిధిని అతిక్రమించి ఉండవచ్చునని, ఆ జడ్జికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నానంటూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం కోర్టుకు హాజరు కావలసి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు.. ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.