సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రం మరో స్థాయిలో నిలిచింది. అయితే ఈ సినిమా కథ నాదే అంటూ ప్రముఖ రైటర్ అరూర్ తమిళ నందన్ అప్పట్లో కోర్టులో ఫిర్యాదు చేశారు. తాను రాసిన జిగుబా అనే కథ ఆధారంగా రోబో సినిమా తీశారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయమై హాజరు కావాలంటూ కోర్ట్ శంకర్ కు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు.
తాజాగా ఇదే విషయమై శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే తన పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం షాక్ కు గురి చేసిందని తన లాయర్ సాయి కుమరన్ కోర్టు ను సంప్రదించగా ఎలాంటి వారెంట్ జారీ కాలేదని ఆన్ లైన్ కోర్టు రిపోర్టింగ్ లోపం కారణంగా ఇలా జరిగిందని శంకర్ క్లారిటీ ఇచ్చారు. పొరపాటును సరి చేశారని మీడియా ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని శంకర్ కోరారు.