తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజుకు కేసుల సంఖ్య రెండు మూడొందలు పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు నిలిపివేసింది తెలంగాణ సర్కార్. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలు తగ్గించాలని ఆదేశాలు ఇచ్చింది. అత్యవసర ఆపరేషన్లలో ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,825 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 1,042 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. అందుకే గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను నిలిపివేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తే కరోనాను అదుపు చేయొచ్చని అటు నిపుణులు సూచిస్తున్నారు.