కరోనా మహమ్మారి నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ పుట్టుకొచ్చింది. నోరో వైరస్ గా వ్యవహరిస్తున్న ఈ మహమ్మారి కేరళలో వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. సాధారణంగా శీతాకాల సీజన్ లో వ్యాపించే ఈ వైరస్ శరీరంలో ప్రవేశించగానే వాంతులు, విరేచనాలు ప్రారంభమవుతాయి. కలుషిత నీరు, ఆహార పదార్థాలు వల్ల కూడా వచ్చే నోరో వైరస్.. సులభంగా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది.
దీనివల్ల చాలామంది కడుపు నొప్పితో కూడా బాధపడతారు. చలి, తలనొప్పి, కండరాల నొప్పులు కూడా బాధిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువ.. అందువల్ల పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ లోపం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మొదట ఈ వైరస్ ని నోర్వ్యాక్ గా 1972 లో ధృవీకరించారు. దీన్ని వింటర్ వొమిటింగ్ బగ్ అని కూడా వ్యవహరిస్తూ వచ్చారు.
ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ వల్ల కూడా ఈ నోరో వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది మరీ ప్రమాదకరం కాకపోయినప్పటికీ నీరు, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చేతులను సోపుతో శుభ్రంగా కడుక్కోవడం కూడా అత్యంత ముఖ్యం. ఒకరినుంచి మరొకరికి ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నందున దీన్ని నివారించడం కాస్త కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు.
ఇది సోకిన వెంటనే డాక్టర్లను సంప్రదించిన పక్షంలో వారు అన్ని టెస్టులు చేసి ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్ (డయేరియా, వొమిటింగ్) చికిత్సకు అవసరమైన మందులను సూచిస్తారు. సాధారణంగా నోరో వైరస్ 8 వారాల్లో అంతమవుతుంది. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.