కేరళలో కొత్త వైరస్ కలకలం రేపింది. ఎర్నాకులంలోని కక్కనాడులో నోరో వైరస్‌ను అధికారులు గుర్తించారు. కక్కనాడులోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన 19 మంది పాఠశాల విద్యార్థులు నోరో వైరస్ బారినపడ్డారు. మొదట 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి.
ఈ క్రమంలో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 19 మందికి నోరో వైరస్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. పాఠశాలలో ఒకటవ, రెండో తరగతి విద్యార్థుల శాంపిల్స్ ను లాబోరేటరీకి పంపినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తెలిపారు. పాఠశాలలో క్లాస్ రూం, టాయ్ లెట్లలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నోరో వైరస్ నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రక్షిత మంచినీటిని విద్యార్థులకు అందించాలని పాఠశాల యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించారు.
నోరో వైరస్ వచ్చిన వారిలో డయేరియా, వాంతులు, స్వల్ప జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చాక, భోజనం చేసేముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని వైద్యాధికారులు సూచించారు.