ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సఫ్దర్ జంగ్ లో 1.9 డిగ్రీలు,రిడ్జ్ లో 2.2 డిగ్రీలు, అయా నగర్ లో 2.6, లోధీ రోడ్ 2.8, పాలమ్ లో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గాలి నాణ్యత 359 పాయింట్లకు పడిపోవడంతో వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్లింది.
పంజాబ్ లోని అమృత్ సర్, పటియాలా,అంబాలా,చండీగఢ్,రాజస్థాన్ లోని గంగానగర్ లో దృష్య గోచరత మందగించిందని అధికారులు వెల్లడించారు. బీహార్ లోని గయా,భాగల్ పూర్,లక్నో, గ్వాలియర్ లో 200 మీటర్ల వరకు ముందున్న వాహనాలు కనిపించడం లేదని తెలిపారు అధికారులు.
ఇక పొగమంచు కమ్మేయడంతో విమానాలు,రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మరో వైపు ఉదయం తొమ్మిది దాటినా రోడ్లపై పొగ మంచు కప్పేయడంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు.