ఉత్తర కొరియా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకుపోతోంది. తాజాగా ఉత్తరకొరియా మరో రెండు బాలిస్టిక్ మిస్సైల్స్ ను గురువారం ప్రయోగించింది.
అంతకు ముందు మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణులను జపాన్ మీదుగా నార్త్ కొరియా మంగళవారం ప్రయోగించింది. ఈ క్రమంలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకే ఉత్తర కొరియా ఇలాంటి చర్యలకు దిగుతోందని యూఎస్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత రెండు వారాల్లో ఇప్పటికే 6 మిస్సైల్స్ ను ప్రయోగించింది. తాజాగా మరోసారి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రం వైపు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియా మరింత అలర్ట్ అయింది.
మరోవైపు ఈ క్షిపణి ప్రయోగాలను జపాన్ కూడా ధ్రువీకరించింది. మొదటి మిస్సైల్ 100 కిలోమీటర్ల ఎత్తులో సుమారు 350 కిలోమీటర్లు దూరం ప్రయాణించిందని పేర్కొంది. రెండో క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్లు ప్రయాణించిందని జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకాజు హమదా వెల్లడించారు.
దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టడంతోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని అమెరికాపై యూఎన్ లో డిప్యూటీ చైనా రాయబారి గెంగ్ షువాంగ్ మండిపడ్డారు. ప్రాంతీయ భద్రతా వాతావరణాన్ని అగ్రరాజ్యం యూఎస్ఏ కలుషితం చేస్తోందని ఆయన అన్నారు.