ఉత్తర కొరియా ఇతర దేశాల వారితో కవ్వింపు చర్యలు మానుకోవడం లేదు. తాజాగా ఆ దేశానికి చెందిన ఓ మిస్సైల్ జపాన్ మీదుగా దూసుకెళ్లింది. అయితే ఈ మిస్సైల్ వల్ల ఎలాంటి నష్టమూ సంభవించలేదు. ఉత్తర కొరియా క్షిపణి ఈశాన్య జపాన్ పైనుంచి దూసుకెళ్లింది. అనంతరం ఆ దేశపు స్పెషల్ ఎకనామిక్ జోన్ వెలుపల సముద్రంలో పడింది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం ధృవీకరించింది.
‘‘ మేము వివరాలను విశ్లేషిస్తున్నాం. అయితే క్షిపణి జపాన్ తోహోకు ప్రాంతం మీదుగా వెళ్ళింది, ఆపై జపాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వెలుపల పసిఫిక్ లో పడిపోయింది ’’ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా అన్నారు. దీనిని హింసాత్మక చర్యగా ఆయన అభివర్ణించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
అనంతరం 30 నిమిషాల తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘ ఉత్తర కొరియా టార్గెట్ గా పంపించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ మీదుగా వెళ్లి ఉండవచ్చు ’’ అని ట్వీట్ చేసింది. అయితే జపాన్ కోస్ట్‌గార్డ్ ఒక ప్రకటనలో క్షిపణి ఇప్పటికే సముద్రంలో దిగినట్లు కనిపించిందని, పడిపోయిన వస్తువుల దగ్గరికి చేరుకోవద్దని షిప్ లను హెచ్చరించింది.
ఉదయం 7:29 గంటలకు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ యాక్టివేట్ అయ్యిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోందని, దయచేసి ప్రజలు భూగర్భం, భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని అందులో పేర్కొన్నారు.
మిస్సైల్ జె-అలర్ట్ సిస్టమ్ ఒక్క సారిగా యాక్టివ్ అయ్యింది. ఈ విషయం నేషనల్ బ్రాడ్‌కాస్టర్ ఎన్ హెచ్ కే స్క్రీన్స్ పై కనిపించింది. దేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నివాసితులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ‘‘ ఉత్తర కొరియా ఉదయం 7:22 గంటలకు తూర్పు వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ’’ అని ప్రభుత్వ అధికార ప్రతినిధి హిరోకాజు మట్సునో మీడియాతో అన్నారు.