ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. కిమ్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని కఠినంగా అమలు చేయాల్సిందే. ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పదు. అయితే, తాజాగా విదేశీ సంస్కృతి అరికట్టాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఉత్తరకొరియా ప్రభుత్వం. 30 ఏళ్లలోపు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని టైట్ జీన్స్, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతల బట్టలు ధరించడం వంటి వాటిని కఠినంగా అణచివేస్తోంది.
ఉత్తర కొరియా దేశంలోని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య గల మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ నిబంధనల్ని అమలు చేస్తోందని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతికి చెక్ పెట్టి.. తమ సంస్కృతి కాపాడుకునేందుకు ఈ విధంగా ఆంక్షలు తీసుకొచ్చింది కిమ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా టైట్ జీన్స్, జుట్టుకు రంగులు, అసభ్యకర రాతలు గల బట్టలు ధరించడం లాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటుంది.
ఇలాంటి వేషధారణతో రోడ్లపై తిరగకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ కనిపిస్తే వారిని పెట్రోలింగ్ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అనంతరం నేరాన్ని ఒప్పుకుని.. తిరిగి అలాంటి దుస్తులు ధరించమని హామీ ఇచ్చిన తర్వాతే వారిని విడుదల చేస్తున్నారు. అయితే, గత ఏడాది మే నెలలోనే ఉత్తర కొరియా జీన్స్, హెయిర్ స్టైల్స్‌పై నిషేధించింది.
ఈ విదేశీ అలంకరణను ‘ప్రమాదకరమైన విషంగా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. ఆ తర్వాత అధికారులు వీటిపై దృష్టి సారించి.. ఈ మేరకు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూత్ లీగ్ భారీ ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పాశ్చాత్య సంస్కృతి నిషేధంపై సమావేశాలను నిర్వహిస్తోంది.
ఇక మరోవైపు ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చర్యలు ప్రారంభిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తామని దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్ తెలిపారు. మంగళవారం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. ఉత్తర కొరియా సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి సిద్ధమన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేస్తే ప్రోత్సాహకాలను అందిస్తామని దక్షిణ కొరియా నాయకులు గతంలోనూ ప్రకటించారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది.