అత్యంత అధునాతనమైన రెండు క్రూజ్ మిసైళ్లను ఓ సబ్ మెరైన్ నుంచి ప్రయోగించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియాతో కలిసి మీరు భారీ ఎత్తున సైనిక విన్యాసాలకు దిగిన పక్షంలో నిర్దాక్షిణ్యంగా ‘శిక్షిస్తామని’ ఈ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ..అమెరికాను హెచ్చరించారు. ఇటీవలే తమ దేశం న్యూక్లియర్ వార్ హెడ్ తో కూడిన ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను కూడా ప్రయోగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సోమవారం నుంచి ఈ నెల 23 వరకు అమెరికా, దక్షిణ కొరియా ‘ఫ్రీడమ్ షీల్డ్’ పేరిట సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయి. ఈ డ్రిల్స్ ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తమ దేశాన్ని ఇరకాటాన బెట్టేందుకే అమెరికా వీటిని ప్రారంభించిందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మండిపడింది.
ఈ విన్యాసాలను అమెరికా ఇలాగే కొనసాగించిన పక్షంలో పసిఫిక్ ప్రాంతాన్ని ‘ఫైరింగ్ రేంజి’ గా మారుస్తామని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా హెచ్చరించారు. అణు సామర్థ్యం కలిగిన బీ-52 బాంబర్ డ్రిల్స్ ను అమెరికా, సౌత్ కొరియా చేపట్టడాన్ని తాము సహించబోమని ఆమె చెప్పారు.
మా క్షిపణి పరీక్షలను అడ్డుకోవాలని చూస్తే దాన్ని యుద్ధ ప్రకటనగానే భావిస్తామని ఆమె అన్నారు. పసిఫిక్ సముద్రం, జపాన్ లేదా అమెరికా సొత్తు కాదని నార్త్ కొరియా విదేశాంగ శాఖ పేర్కొంది. నార్త్ కొరియా తాజాగా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన రెండు క్రూజ్ క్షిపణులు ఈస్ట్ సీలో 1500 కి.మీ. దూరం ప్రయాణించి సుమారు 8 సెకండ్లలో లక్ష్యాన్ని ఛేదించాయి. గతంలో కూడా ఈ దేశం ప్రయోగించిన దూర శ్రేణి మిసైళ్లు జపాన్ భూభాగంలో పడ్డాయి. ఇందుకు జపాన్ తీవ్ర నిరసనను ప్రకటించింది.