ప్రముఖ నటుడు, అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పాల్సినవాడే ఇలా చేస్తే ఎలా అని రైల్వే శాఖ విసుక్కుంటోంది. భారత ప్రజలకు ‘రోల్ మోడల్’ అని అంతా ఎంతో మురిపెంగా వ్యవహరించే సోను సూద్ కథే ఇది! ఆయన ఆ మధ్య ఓ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణిస్తూ కెమెరా కళ్ళకు చిక్కాడు. ఇది సహజంగానే నార్తర్న్ రైల్వే అధికారుల కంటబడింది.. వారు ఆశ్చర్యపోతూ.. ఇలా చేయవద్దని, చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. లక్షలాది భారతీయులకు మీరు రోల్ మోడల్.. మీరే ఇలా చేస్తే ఎలా అన్నారు. ఈ వీడియో ప్రజలకు..మీ అభిమానులకు తప్పుడు సంకేతాలనిస్తుందని మందలించారు.
మళ్ళీ ఇలా చేయవద్దని, సురక్షిత ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని సూచించారు. గత నెల 13 న తాను ఇలా చేసిన ట్రైన్ ప్రయాణ తాలూకు వీడియోను సోను సూద్ అప్ లోడ్ చేసి..’వెలుగు లోకి ‘తెచ్చాడు. సరదాకోసమే ఆయన ఇలా చేసినప్పటికీ.. రైల్వే శాఖ మాత్రం తన ట్విటర్ అకౌంట్ లో తీవ్రంగా స్పందించింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ అధికారులు కూడా..ఈ విధమైన స్టంట్లు డేంజర్ అని హెచ్చరించారు.
రైలు ఫుట్ బోర్డు మీద కూర్చుని ప్రయాణించడం సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ కావచ్చేమో గానీ, రియల్ లైఫ్ లో మాత్రం కాదని వారన్నారు. సురక్షితమైన గైడ్ లైన్స్ ని పాటించాలని సూచించారు.
నిజ జీవితంలో కూడా హీరో అయిన మీరు ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయవద్దని, ఇలా అంటున్నందుకు క్షమించాలని ఓ ట్విటర్ యూజర్.. సోను సూద్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యువకులు ఇలాంటి ప్రమాదకరమైనవి స్ఫూర్తిగా తీసుకోవచ్చునని, యాక్సిడెంట్ల పాలు కావచ్చునని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా పాండమిక్ సమయంలో బాధితులకు సోను సూద్ అందించిన ఆపన్న హస్తాన్ని ఇప్పటికీ ఎవరూ మరువలేదు.