తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంటుంది. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరేత్తిస్తున్నాయి. అయితే, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత రాంచంద్రరావుకు మాత్రం ఎదురీత తప్పదన్న ప్రచారం సాగుతుంది.
ప్రశ్నించే గొంతుకకు ఓటేయాలన్న ఉద్దేశంతో… తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ను కాదని బీజేపీకి గ్రాడ్యుయేట్లు పట్టం కట్టిన స్థానం ఇది. ఒకరకంగా అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ కు మొదటి ఎదురుదెబ్బ. పైగా ఉద్యోగసంఘాల నేతగా ఉన్న దేవీ ప్రసాద్ ను కాదని రాంచంద్రరావుకు పట్టం కట్టారు.
కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చాయి. అయితే… బీజేపీపై అప్పుడున్నంత సానుభూతి మాత్రం కనపడటం లేదు. గెలిచాక రాంచంద్రరావు ఏం చేశారు…? ఉద్యోగ సమస్యలపై ఎక్కడ మాట్లాడారంటూ ప్రతిపక్షాలు విరుచుకపడుతున్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి… చిన్నారెడ్డి కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పీవీ కూతుర్ని బరిలోకి దించి… మంత్రులను పెట్టి ప్రచారం చేయిస్తుంది. కానీ బీజేపీ పెద్దలెవరు ఇంకా ప్రచారంలో పాలుపంచుకోవటం లేదు. పైగా ప్రశ్నిస్తానని చెప్పి సైలెంట్ గా ఉన్నారన్న విమర్శ బలంగా ఉంది. దీంతో విమర్శలకు చెక్ పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి శ్రమించాల్సి వస్తుంది. మండలి రికార్డ్ చూడండి అంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు.
గత ఎన్నికల్లో ఉన్న అడ్వాంటేజ్ ఈసారి బీజేపీకి మైనస్ అయిందని, కాంగ్రెస్ కాస్త దూకుడుగా ఉంటే గెలిచే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.