పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. గతేడాది ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని, రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గిస్తే వినియోగదారులపై భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సీఎంలతో ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..
దీనికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే కట్టుబడ్డాయన్నారు. మరి కొన్ని రాష్ట్రాలు కట్టుబడకపోవడంతో అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగించడమేనని పేర్కొన్నారు.
పలు రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నులు తగ్గించాయని లేదంటే ఆయా రాష్ట్రాలు కూడా అధిక ఆదాయం పొందేవన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని పన్నులు తగ్గించాలని అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాలు కారణాలేవైనప్పటికీ పన్నులను తగ్గించలేదన్నారు.
పన్నులు తగ్గించకపోవడం వల్ల వారు ఎంత రెవిన్యూ పొందారన్న విషయంపై తాను చర్చించదలుచుకోలేదన్నారు. ఆరునెలల క్రితమే చేయాల్సినవి అమలు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కేంద్రం ఆదాయంలో 42 శాతం రాష్ట్రానికి వస్తోందని మీ అందరికీ తెలుసన్నారు.