లోక్ సభలో ప్రధాని మోడీ సుదీర్ఘంగా సాగించిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ఆయన ప్రసంగం తమకేమాత్రం సంతృప్తి కలిగించలేదని, ఆయన స్పీచ్ లో గౌతమ్ అదానీ ప్రస్తావనే లేదని రాహుల్ అన్నారు. అదానీ మోడీ స్నేహితుడు కాకపోతే.. అట్టుడుకుతున్న అదానీ అంశంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చేవారని ఆయన చెప్పారు. ఆదానీని మోడీ రక్షిస్తున్నారన్నది స్పష్టమైపోయిందన్నారు. బుధవారం పార్లమెంట్ బయట రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆయన ప్రసంగం పూర్తిగా విన్నానని, ఎక్కడా అదానీ పేరే వినబడలేదని అన్నారు. రానున్న రోజుల్లో అదానీ వ్యవహారంపై తమ పార్టీ ఉధృత పోరాటం చేస్తుందన్నారు.
ఇక అదానీ గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటోందని లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. ఐటీ, ఈడీ, సిబిఐ వంటి సంస్థలు ఇదే పనిలో ఉన్నాయన్నారు. తమ వాటాలను, లేదా తమ కంపెనీలను అదానీ సంస్థలకు అమ్మేలా కృష్ణపట్నం పోర్టు, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ , జీవీకే గ్రూపు వంటివాటిని గత కొన్నేళ్లుగా ఈ సంస్థలు ఒత్తిడి చేస్తూ వచ్చాయని, దాడులకు కూడా దిగాయని ఆయన అన్నారు. మోడీ, అదానీ ‘దోస్తీ’ ని చూడాలంటూ ఆయన మోడీతో అదానీ దిగిన ఫోటోను తన ట్వీట్ కి జోడించారు.
2024 లో మెచ్యూరిటీ కి ముందే తమ 1.11 బిలియన్ డాలర్ల లోన్స్ ని ఇన్వెస్టర్లకు చెల్లిస్తామని, వీటిని విడుదల చేస్తామని అదానీ గ్రూపు చేసిన ప్రకటనతో ఈ గ్రూప్ లోని పది కంపెనీలకు గాను ఏడు సంస్థల షేర్లు రెండో రోజైన బుధవారం కూడా పుంజుకున్నాయి. కొంతమంది లెండర్స్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చిన ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా పెరిగింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు సుమారు 20 శాతంతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్ 8.34 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ విల్మార్ కూడా 5 శాతం, అంబుజా సిమెంట్ 0.2 శాతం, కోలుకున్నాయి. అయితే అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, ఏసీసీ షేర్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి.