లెజెండరీ ఒడియా రచయిత్రి బినాపాని మొహంతి ఇక లేరు. వయో సంబంధ అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె 100కు పైగా పుస్తకాలను రచించారు. ‘పాటదేయ్’, ‘కస్తూరి మృగ ఓ సబుజా అరణ్య’, ‘ఖేలా ఘరా’, ‘నాయకు రాస్తా’, ‘బస్త్రాహరణ’, ‘అంధకారారా’ పుస్తకాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
2020లో ఆమె పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. గతంలో ఆమె సాహిత్య అకాడమీ అవార్డు, సరళ సమ్మాన్ లాంటి మరెన్నో అవార్డులను పొందారు. ఆమె రాసిన కష్మకష్ కథను దూరదర్శన్ లో ప్రసారం చేసింది.
ఆమె మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను కలిచి వేసిందని ట్వీట్ చేశారు. ఒడిశా సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవలు మరవలేనివని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.