అమ్మాయిలు లేకపోతే నో ఎంట్రీ అని పబ్‌ల దగ్గర చూస్తుంటాం. కానీ ఒడిశాలో ఓ కళాశాలలో బాయ్ ఫ్రెండ్ లేనిదే నో ఎంట్రీ అంటు కండిషన్ పెట్టింది. ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగత్సింగ్పూర్ జిల్లాలోని స్మామి వివేకనందా మెమోరియల్ కళాశాల పేరిట ఉన్న ఓ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కాలేజీకి విద్యార్థినులు తమ బాయ్ ఫ్రెండ్స్‌తో రావాలని నోటీసులు పేర్కొన్నారు. బాయ్ ఫ్రెండ్ లేకుండా కాలేజీకి వస్తే అనమతించబోమని నోటీసుల్లో వెల్లడించారు.
ప్రేమికుల దినోత్సవం నాటికి అందరు అమ్మాయిలకు కనీసం ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలని నోటీసుల్లో తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగిల్ గర్ల్స్ను కాలేజీ పరిసరాల్లోకి అనుమతించబోమని, వారు తమ బాయ్ ఫ్రెండ్‌తో దిగిన లేటెస్ట్ ఫొటో చూపించాలని కండిషన్ పెట్టారు.
ప్రేమించండి…ప్రేమను పంచండి అంటూ నోటీసుల్లో రాసుకొచ్చారు. నోటీసులపై ఆ కళాశాల ప్రిన్సిపల్ సంతకం కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖండించారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన పేరిట ఓ తప్పుడు నోటీసు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోందన్నారు. ఆ నోటీసు అవాస్తవమన్నారు. అది తమ కళాశాల జారీ చేసిన సర్క్యులర్ కాదని తేల్చి చెప్పారు. ఆ నోటీసుపై ఉన్నది తమ లెటర్ హెడ్ కాదన్నారు. తమ కళాశాల పేరును చెడగొట్టేందుకే కొందరూ ఈ పని చేశారని ఫిర్యాదులో ఆయన తెలిపారు.