బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహరంలో మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆదివారం కరీంనగర్ సీపీ సత్యనారాయణతో పాటు.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సీఎస్ సోమేష్‌కుమార్‌కు సైతం కమిటీ కాపీ పంపించింది.
317 జీవోను నిరసిస్తూ బండి సంజయ్ పార్టీ శ్రేణులతో కలిసి దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రోటోకాల్ పాటించలేదనే కారణంతో సంజయ్ సహా మరో నలుగురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ.. పార్లమెంట్ లోక్‌సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు సంజయ్.
దీంతో విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. కరీంనగర్ సీపీ సత్యనారయణ, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ లకు గతంలో నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 3న కమిటీ ముందు సీపీ హాజరుకాగా.. డీజీపీ, సీఎస్ మాత్రం హాజరు కాలేదు. అయితే.. మరోసారి కమిటీ ముందుకు రావాలని సీపీకి నోటీసులు అందాయి.
317 జీవోతో ప్రభుత్వం ఉద్యోగులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయే అవకాశం ఉందని కూడా టీచర్ సంఘాలు ఆందోళన చేశాయి. ఈ ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. స్థానికత విషయంలో కొన్ని సంఘాలు, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికార టీఆర్ఎస్ మండిపడింది.