మహిళా దినోత్సవం రోజున ఈడీ అధికారులు తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత బాగా ఉందో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బట్టే తెలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మండిపడ్డారు. మహిళలను అగౌరవ పర్చడానికి ఇంతకంటే వేరే ఉంటుందా? అన్నారు.
మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించి మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవించుకుంటుంటే.. ఈడీ అధికారులు మాత్రం మహిళలను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు కరెక్టు అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమాన్ని వారం రోజుల క్రితమే కవిత ప్రకటించారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇది జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు. విచారించవచ్చు కానీ ఎంచుకున్న తేదీ, సందర్భంపైనే మాకు అభ్యంతరం ఉన్నది కోర్టుల్లో విచారణ తర్వాత నిజమేంటో తెలుస్తుందని అన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా జరుగుతున్నదని తెలిపారు. ఈ ఒక్కరోజులోనే మొత్తం ఎంక్వయిరీని దర్యాప్తును ఈడీ పూర్తి చేసేస్తుందా? అని అడిగారు. మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీ చేసి మొత్తం మహిళా జాతిని ఈడీ కించపరిచిందని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇది జరుగుతున్నదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ ఎంక్వయిరీకి ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటానని స్వయంగా కవిత ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అయినా దర్యాప్తులో భాగంగా పిలిస్తే హాజరై వివరాలన్నీ ఇస్తామని చెప్పారు.మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీ చేసి బెదిరించే ప్రయత్నమేనని స్పష్టమవుతున్నదని మండిపడ్డారు.