రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. గ్రూపు-1 నోటిఫికేషన్‌కు సంబంధించి సన్నాహాలు చేస్తుంది టీఎస్పీఎస్సీ. ఈ మేరకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. శనివారం జరిగిన టీఎస్పీఎస్సీ పాలకమండలి సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. గ్రూపు-1 పరిధిలో ఉద్యోగాలపై ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ మేరకు టీఎస్పీఎస్సీ 19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలన్నింటినీ బోర్డు క్షుణ్నంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధరించుకుంది. మరో మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
అయితే, గ్రూపు -1పై బోర్డు వైపు నుంచి క్లియరెన్స్ ఉండగా.. సర్కార్ నుంచి మరో రెండు మూడు అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఇవి రాగానే నోటిఫికేషన్ రానుంది. అయితే, దరఖాస్తుల స్వీకరణకు ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి, ప్రిలిమినరీ ఎప్పుడు జరపాలి వంటి అంశాలపై తాత్కాలిక టైంటేబుల్‌ను సిద్ధం చేసుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో వెలువడిన వాటితో పోలిస్తే తెలంగాణ తొలి గ్రూపు-1 నోటిఫికేషన్ అత్యధిక పోస్టులతో వెలువడనుంది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే సంబంధిత ముసాయిదాను సిద్ధం చేసుకుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు పెరగడంతో ఏకంగా 503 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. అయితే ఈ దఫా గ్రూప్-1 పోస్టుల భర్తీ చేసే సమయంలో ఇంటర్వ్యూలను రద్దు చేశారు. తొమ్మిది నెలల్లోనే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి పోస్టింగ్‌లు ఇవ్వాలని కూడా కమిషన్ భావిస్తుంది. ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించడంతో గ్రూప్-1 పరీక్షా విధానంలో కూడా మార్పులు చేయనున్నారు. 900 మార్కుల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.