టాలీవుడ్ ప్రతి నెల విజయాలు చూస్తోంది. కరోనా తర్వాత పూర్తిస్థాయిలో థియేట్రికల్ వ్యవస్థ కోలుకుంది. నవంబర్ నెలలో కూడా టాలీవుడ్ లో సానుకూల వాతావరణం కనిపించింది. పెద్ద సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కానప్పటికీ, చిన్న సినిమాలు సత్తా చాటాయి.
అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ నెలకు మంచి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇనిస్టెంట్ హిట్ గా నిలిచింది. సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రానప్పటికీ, అల్లు శిరీష్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది.
ఇక సమంత నటించిన యశోద సినిమా కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ, సమంత కెరీర్ కు మరింత బూస్టప్ ఇచ్చింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో హరి-హరీష్ దర్శకులిగా పరిచయమయ్యారు.
నవంబర్ నెలలో మరో ఆశ్చర్యకరమైన ఫలితం గాలోడు. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో పాటు వచ్చిన మసూద కూడా సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. హారర్ ఇష్టపడే జనాలు ఈ సినిమాను ఎగబడి చూశారు. నిజంగా భయపెట్టింది ఈ మూవీ.
ఇక చివర్లో వచ్చిన లవ్ టుడే సినిమా ఏకంగా ప్రభంజనం సృష్టించింది. వసూళ్లతో దుమ్ములేపుతోంది. ఇలా నవంబర్ నెలలో ప్రతి వారం ఓ సినిమా బాక్సాఫీస్ ను ఆక్రమించింది. టాలీవుడ్ కు సరికొత్త కళ తీసుకొచ్చింది.