పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో కుంభకోణం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధా ఛటర్జీని ఈడీ అధికారులు సుమారు 20గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెను ఈడీ అధికారులు నిర్బంధించారు. ఇదే కేసులో మంత్రికి మరో సన్నిహితురాలు, కజ్రివజ్రుల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మొనాలిసా దాస్ పాత్రపైనా ఈడీ ఆరాతీస్తున్నట్టు సమాచారం .
మొనాలిసాపైనా ఈడీ అధికారులు దృష్టి పెట్టారని బీజేపీ నేత దిలీప్ ఘోష్ తెలిపారు. ఆమె పేరిట 10 ప్లాట్లు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆమెపై ఈడీ నిఘా పెట్టిందని ఆయన వెల్లడించారు. ఆమె కూడా ఓ బంగ్లాదేశీయురాలని ఆయన పేర్కొన్నారు.
బెంగాల్ వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ , విద్యాశాఖ మంత్రి ప్రరేశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యతో పాటు పలువురి నివాసాలపై ఈడీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో పార్థచటర్జీ వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పీకే. బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు.