అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ప.గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను టెన్షన్ పెట్టిన వింత వ్యాధి గడిచినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రెండ్రోజులుగా వ్యాధి లక్షణాల కేసులు తగ్గిపోవటం… ఆదివారం ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాకపోవటంతో అధికారులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
మరోవైపు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వింత వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల ఐదో తేదీ శనివారం మధ్యాహ్నం మొదలైన కేసుల పరంపర… 12వ తేదీ శనివారం వరకు కొనసాగింది. అకస్మాత్తుగా కిందపడిపోయి, మూర్చతో నురగలు కక్కుతూ… వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి.
కేవలం ఎనిమిది రోజుల్లోనే 615 మంది వింత వ్యాధి బారినపడగా, ఒకరు మరణించారు. ఇక విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 35మందిలో 29మంది డిశ్చార్జ్ కాగా, విజయవాడలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా సోమవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.