ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అన్నింటినీ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు ఏ సినిమా చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఫ్యాన్స్ లో కూడా ఓ రకమైన గందరగోళం నెలకొని ఉంది. అందుకే ఈ స్టోరీ ఇస్తున్నాం. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా వివరాలు ఇవి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం ప్రాజెక్ట్-K అనే సినిమా చేస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా ప్రస్తుతం సలార్ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ హీరో మాత్రం ప్రాజెక్ట్-K పనిలో ఉన్నాడు. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్-K సినిమా. ఈ మూవీకి సంబంధించి మొదటి షెడ్యూల్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై చేశారు. ఇప్పుడు సెకెండ్ షెడ్యూల్ ను ప్రభాస్ పై తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ దీపిక కూడా జాయిన్ అవ్వబోతోంది. కాకపోతే ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు.
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ప్రాజెక్ట్-K సినిమా. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు నాగ్ అశ్విన్. సెట్ నుంచి గ్రాఫిక్స్ వరకు అన్నీ కొత్తగా ఉంటాయి. చివరికి నటీనటుల దుస్తులు కూడా ఎంతో విలక్షణంగా ఉండబోతున్నాయి. 2024లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.