పత్రా చాల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ కు ఈడీ సమన్లు పంపింది. సంజయ్ రౌత్ కు ఈడీ కస్టడీ పొడిగించిన గంట వ్యవధిలోనే ఆయన భార్యకు నోటీసులు పంపడం గమనార్హం.
వర్షా రౌత్ ఖాతాలో జరిగిన అక్రమ లావాదేవీలు వెలుగులోకి రావడంతో సమన్లు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. సంబంధం లేని వ్యక్తుల నుంచి వర్షా రౌత్ ఖాతాలో రూ. 1.08 కోట్ల మొత్తం జమైనట్టు ఈడీ పేర్కొంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ లో వర్షా రౌత్, సంజయ్ ఇద్దరు సహచరులకు చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
ఈ కేసులో సంజయ్ రౌత్ కస్టడీ ఈరోజుతో ముగియాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీని ఈ నెల 8వరకు పొడిగిస్తూ పీఎంఎల్ ఏ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.