వార్తల ప్రసార విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఆర్పీ రేటింగులు సాధించడమే టీవీ ఛానెల్స్ లక్ష్యంగా మారిపోయిందని మండిపడింది. వార్తా ప్రసారాల విషయంలో ఛానెల్స్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. పలు విషయాల్లో వార్తా ఛానెల్స్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ వార్తా ఛానెల్స్ సమాజాన్ని చీలుస్తున్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా కొందరు వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను ప్రమాదంగా మారాయని జస్టిస్ కేఎం. జోసెఫ్, జస్టిస్. బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ప్రసంగాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది.
వార్తా ప్రసారాల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే వార్తా ఛానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. టీఆర్పీ రేటిగుల కోసం ప్రతి వార్తను సంచలనంగా మారుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
టీవీల్లో లైవ్ చర్చలు నిర్వహిస్తున్న సమయంలో చాలా సార్లు యాంకర్లు సమస్యలో భాగం అయిపోతున్నారని పేర్కొంది. ఓ వైపు ప్యానల్ లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే మరోవైపు ఇష్టానుసారం మ్యూట్ చేస్తూ వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ విమర్శించింది.
న్యూస్ పేపర్లతో పోలిస్తే టీవీ ఛానళ్లు అత్యంత శక్తివంతమైనవని ధర్మాసనం వెల్లడించింది. అవి ప్రేక్షకులను చాలా ప్రభావితం చేయగలవని చెప్పింది. ప్రేక్షకుల్లో చాలా వరకు పరిణితి లేనివాళ్లు ఉన్నారని, ఈ క్రమంలో వారు రెచ్చిపోకుండా ఉండలేకపోతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
న్యూస్ పేపర్లలాగా టీవీ ఛానళ్లకు నియంత్రణ వ్యవస్థ లేకపోవడం చాలా దురదృష్టకరమని జస్టిస్ జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేష పూరిత వ్యాఖ్యల వ్యాప్తికి కారణమవుతున్న న్యూస్ యాంకర్లను లైవ్ నుంచి ఎందుకు తప్పించకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దేనని పేర్కొన్నారు.