అస్సాంలో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో జాతీయ పౌర రిజిస్టర్ ను తయారు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ విషయంలో ఏ మతస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అస్సాంలో మరోసారి జాతీయ పౌర రిజిస్టర్ ను తయారు చేస్తామని తెలిపారు. గతంలో చేసినప్పటికీ సరైన పత్రాలు చూపించని 19 లక్షల మంది మిగిలిపోయారని చెప్పారు. వారిని వెంటనే చట్టవిరుద్ధంగా ఉంటున్నట్టు ప్రకటించబోమని…వారికి ఒక అవకాశం ఇచ్చి ఫారినర్స్ ట్రిబ్యునల్ కు, కోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎన్.ఆర్.సిలో పేర్లు లేని వారు ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చని…అస్సాం ప్రభుత్వం వారికి ఆర్ధిక సహాయం కూడా చేస్తుందని తెలిపారు. ఇటీవల కోల్ కతాలో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ఎన్.ఆర్.సి అనేది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని…ఎక్కువ మంది చొరబాటుదారులతో ఏ దేశం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా నడపలేదన్నారు. ఎన్.ఆర్.సి వల్ల లక్షలాది మంది హిందువులు బెంగాల్ వదిలి వెళ్లాల్సి వస్తుందని మమతా బెనర్జీ ఆరోపించడంపై స్పందిస్తూ హిందూ, సిక్కు, జైన్, బుద్ధిస్ట్, క్రిస్టియన్ శరణార్ధు లెవరని దేశం విడిచి వెళ్లాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయదని హామీ ఇస్తున్నానని అన్నారు.