ముందస్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్ ఓవర్ లోడ్ కావడంతో అటు వైపు చూస్తున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. ఆ పార్టీ నుంచే ఎన్నికల సమయానికి చాలామంది కేసీఆర్ కు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్, బీజేపీలో చేరికలు ఒక్కొటిగా మొదలయ్యాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ బాలా త్రిపుర సుందరి బీజేపీ గూటికి చేరుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
గురువారం ఉదయం 9 గంటలకు ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
విదేశాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించిన బాలా త్రిపుర సుందరి.. స్వదేశానికి తిరిగొచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఈమెను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.