– ఎన్నారై కాలేజీ నిధుల గోల్ మాల్ వ్యవహారం
– నిజమౌతున్న తొలివెలుగు క్రైంబ్యూరో కథనాలు
– మేఘా ఇంట్లో మెడికల్ కాలేజీ సర్వర్!
– రూ.42 కోట్ల నగదు మాయం
– రూ.2 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్ చూపించిన వైనం
– కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై మెడికల్ కాలేజీ కబ్జా బాగోతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది తొలివెలుగు క్రైంబ్యూరో. ఎక్కడ ఎలాంటి లొసుగుల్ని వాడుకుని మేఘా ఎంట్రీ ఎలా ఇచ్చిందో.. ఎవరిని తనవైపు తిప్పుకుందో.. నగదు వ్యవహారం.. ఇలా అనేక కథనాల్ని ఇచ్చింది. ఆ బాగోతాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి.. ఆఫీషియల్ గా బయటపడుతున్నాయి. సేవ పేరుతో కోట్లాది రూపాయల నగదుని పోగు చేసుకుంటున్నారని తొలివెలుగు క్రైంబ్యూరో చెప్పిందే నిజమని.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెబుతున్నారు. ఎన్ఆర్ఐ కాలేజీ అడ్మిన్ ఆఫీసర్ మండవ విష్ణువర్ధన్ రావు ఇవన్నీ గుర్తించారు. ప్రత్యేక అధికారి పాలనలో కూడా బ్యాంకు అధికారులు రూ.73 లక్షల చెక్స్ ని ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే ఈనెల 20న క్లియర్ చేశారు. దీంతో హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఇంకా అక్రమాలను కొనసాగిస్తున్నారని దీన్నిబట్టి అర్థం అవుతోంది. ఈ అంశంపై సోమవారం మేనేజర్ అకౌంట్స్ శ్రీనివాస రాజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర, సీఏ సీటీ చౌదరితోపాటు సోము కృష్ణమూర్తిపై ఫిర్యాదు చేశారు.
సీఎస్‌ఆర్ ఫండ్స్ పంపి నోట్లు స్వాహా
సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు తమకు ఉపయోగపడేలా సీఎస్ఆర్ ఫండ్స్ ని వాడుతుంటారు. లెక్కలు చూపించుకుంటారు. మేఘా కృష్ణారెడ్డి మెడికల్ సీట్లలో వచ్చిన నగదుని మళ్లించుకొని సీఎస్ఆర్ ఫండ్స్ పై రూ.2 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. రూ.42 కోట్ల నగదు తరలివెళ్లినట్లు ప్రత్యేక అధికారికి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే క్రిమినల్ కేసులు నమోదు అయ్యేలా చర్యలు తప్పవని సమాచారం. రాజకీయ నాయకులకు లెక్కలు చెప్పని నగదు కావాలంటే.. మెడికల్ కాలేజీనే సరైన బంగారు బాతుగా భావించి.. ఎంట్రీ ఇచ్చి.. కోట్లు కోట్టేసేందుకు ప్లాన్ చేశారని 18 మంది డైరెక్టర్స్ ఆరోపిస్తున్నారు.
DocScanner 23 May 2022 7-36 pm
మేఘా గుప్పిట్లో కాలేజీ సర్వర్
ఎన్నారై మెడికల్ కాలేజీ సర్వర్ అంతా హైదరాబాద్ లో ఉంటుంది. నిత్యం వాటిపై నిఘా పెట్టి ఉంచుతారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో.. ఎలా వాడుకుంటున్నారో ఆ సర్వర్ ద్వారానే తెలిసిపోతుంది. ఇందుకు ప్రత్యేక పాస్ వార్డ్ లు పెట్టి వ్యవస్థను కొనసాగించారు. ఈ విషయాన్ని పసిగట్టిన అడ్మిన్ అధికారి పాస్ వార్డ్ లు మార్చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. దీంతో గతంలో ఏం జరిగిందో అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.
ఆర్బిట్రేటర్ కి బెదిరింపు మెయిల్స్!
ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ట్రైబ్యునల్ ఓ ఆర్బిట్రేటర్ ని నియమించింది. అందరి పక్షాన వాదనలు విన్న జస్టిస్ దేవేందర్ గుప్తా పూర్తి తీర్పు ఇచ్చేంత వరకు స్పెషల్ ఆఫీసర్ ని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం మేఘా గ్యాంగ్ కి కొరకరాని కొయ్యగా మారింది. ఈ విధానంపై కోర్టుకి వెళ్తున్నామని సుప్రీంకోర్టు జడ్జి సోదరుడు అయిన న్యాయవాదితో బెదిరింపు మెయిల్ చేయించినట్లు తెలుస్తోంది. చెప్పినట్లు వినాల్సిందేనని లేకపోతే.. సుప్రీంకోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకుంటామని నేరుగా చెప్పినట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది.
సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ!
కాలేజీలో జరుగుతున్న తతంగాన్ని అంతా హైకోర్టుకు తెలిపారు 18 మంది డైరెక్టర్స్. దీంతో మొదటగా డాక్టర్స్ కి స్పెషల్ ఆఫీసర్ కి రక్షణ కావాలని అందుకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కాలేజీలో గొడవలు కాకుండా చూసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషనర్ వాదనను ఏకీభవించిన జస్టిస్ మన్మథరావు.. రక్షణ బలగాలను దింపాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక నుంచి పోలీసులే కాలేజీకి ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు.