రెండు రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం తంగడపల్లిలో కేసీఆర్ వీరాభిమాని, తెలంగాణ ఉద్యమకారుడు నర్సింహా వినూత్న నిరసనకు చేపట్టాడు. అతని బాధను తొలివెలుగు ‘‘ఓ ఉద్యమకారుడి దీనావస్థ!’’ పేరుతో కథనాన్ని ఇచ్చింది. అదే సమయంలో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవట్లేదనడానికి నర్సింహా ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. తాజాగా విద్యార్థి నాయకుడు మహిపాల్ కూడా అతనికి సాయం అందించాడు.
నర్సింహా తన ఇంటి వద్దే కేసీఆర్ బ్యానర్ తో దీక్ష చేశాడు. తాము కలలు కన్న తెలంగాణ ఇదేనా? పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇదేనా? అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. తమ ఇల్లు వర్షం పడితే కారుతోందని వాపోయాడు. కూసుకుంట్ల ప్రభాకర్ తో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశానని.. చివరకు తాను రోడ్డున పడ్డానని తెలిపాడు. తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టిన సమయంలో పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నానని, ఇప్పుడు ఏ పని చేసుకోడానికి తన శరీరం సహకరించడం లేదని కన్నీరు పెట్టుకున్నాడు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం చేస్తారని ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. తమ ఆర్థిక పరిస్థితి గురించి టీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే చాలా సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. సహాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. తమను ఆదుకోండి అంటూ నర్సింహా చెప్పిన మాటలు విని మహిపాల్ టీమ్ స్పందించింది.
నర్సింహా గోసను చూసి కొంచెం ఆర్థిక సహాయం చేసి తన యూట్యూబ్ ఛానల్ లో వేశాడు. అది చూసి చలించిపోయిన అమెరికాలోని ఎన్నారైలు అనురుప్, రాజ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ స్పందించి.. లక్ష రూపాయల సాయం చేశారు. ఆ సొమ్మను మహిపాల్ టీమ్ అందజేసింది. తమలాంటి ఉద్యమకారులను ఎక్కడో ఉన్న ఎన్నారైలు అదుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నర్సింహా నిలదీశాడు.