భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. వీరిద్దరి భేటికి సంబంధించిన విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించే దిశగా పనులు కొనసాగించేందుకు ఇరువురు అంగీకరించినట్టు వెల్లడించింది. జాతీయ భద్రతా సలహాదారుల ఐదవ బహుపాక్షిక సమావేశానికి హాజరయ్యేందుకు అజిత్ దోవల్ మాస్కో వెళ్లారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షునితో ఆయన సమావేశం అయ్యారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్వహించిన భద్రతా మండలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…. అప్ఘనిస్తాన్ లో సమ్మిళిత, ప్రాతినిధ్య ప్రభుత్వంతోనే ఆఫ్ఘన్ సమాజానికి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు సమిష్టి పోరాటం చేయాలన్నారు.
ఉగ్రవాదాన్ని పెంచేందుకు అప్ఘనిస్తాన్ ను ఉపయోగించుకునేలా ఏ దేశాన్ని అనుమతించ వద్దన్నారు. అప్ఘనిస్తాన్ లోని సహజ వనరులను అక్కడి ప్రజల సంక్షేమానికే ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రష్యా, ఇరాన్, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, చైనా, తజకిస్తాన్, తుర్కిమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి.