భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి శుక్రవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా లడఖ్ లో నెలకొన్న ప్రతిష్టంభన, భౌగోలికంగా రాజకీయంగా నెలకొన్న చిక్కుల గురించి చర్చకు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఇక భారత్- చైనా సంబంధాలు ముందుకు సాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో చైనా బలగాలను త్వరగా పూర్తిస్థాయిలో ఉపసంహరించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
లడఖ్‌లో మిగిలి ఉన్న సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు గాను అడ్డంకులన్నింటిని తొలగించాలని దోవల్ కోరినట్టు సమాచారం.
చైనా విదేశాంగ మంత్రి ఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్నారు. లడఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత మొదటి సారి ఆయన భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ను కూడా చైనా మంత్రి శుక్రవారం కలిశారు.