దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సీబీఐ శనివారం దాడులు నిర్వహించింది. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో లొకేషన్ కేసుకు సంబంధించి ఈ సోదాలను నిర్వహించినట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కతాతో పాటు మరికొన్ని నగరాల్లో ఈ దాడులు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఎస్ఈ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రహ్మణియన్ లపై ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.
ఎన్ఎస్ఈలోని కంప్యూటర్ సర్వర్ల నుంచి కీలక సమాచారం స్టాక్ బ్రోకర్లకు వెళ్లినట్టు ఆరోపణలు రావడంతో 2018లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.
ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. ఓ ‘హిమాలయన్ యోగి’తో ఆమె ఈ-మెయిల్ సంభాషణలు జరిపినట్లు సెబీ తన నివేదికలో వెల్లడించింది.
ఆమెతో పాటు ఎన్ఎస్ఈ గ్రూప్ ఆపరేటింగ్ మాజీ ఆఫీసర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ మేరకు ఫిబ్రవరిలో ఆనంద్ సుబ్రహ్మణియన్ ను, మార్చి6న చిత్ర రామకృష్ణను సీబీఐ అరెస్టు చేసింది.