హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. దీనికి కేరళలో జరిగిన ధ్వంసమే కారణం.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ జోక్యం చేసుకోవడం లేదని నిరనస ర్యాలీ చేపట్టింది ఎస్ఎఫ్ఐ. ఈ క్రమంలోనే రాహుల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 100 మంది కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ భద్రతను పెంచారు.
ఎస్ఎఫ్ఐ తీరును నిరసిస్తూ.. హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు. రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో చిక్కడపల్లి ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యావత్ భారతదేశ ప్రజల కొరకు వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడి కార్యాలయంపై విధ్వంసాన్ని ఖండిస్తూ తాము ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశామని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటే తమ సమాధానం ఇదే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.