వరంగల్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంజయ్ కిరణ్ ఈమధ్యే చనిపోయాడు. అతని మృతికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమేనని డాక్టర్లు తేల్చారు. తమ బిడ్డ చావుకు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ సరిగ్గా లేకపోవడమేనని మృతుడి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
కొద్దిరోజుల క్రితం ట్రిపుల్ ఐటీ మెస్ లో ఫుడ్ పాయిజన్ అయి.. చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. అక్కడ సరైన ఆహార వసతి లేదని ఈ ఘటనే రుజువు చేసింది. అలాంటి చెత్త తిండి తినీ తినీ.. ఆరోగ్యం దెబ్బ తిని తమ పిల్లాడు మృతి చెందినట్లుగా బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎన్‌ఎస్‌యూఐ ఆగ్రహించింది.
సంజయ్ మృతిని నిరసిస్తూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థి మరణించినా ప్రభుత్వం కానీ, సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవడంలేదని ఆందోళన చేపట్టారు.
మంత్రి ఇంటిని ముట్టడించేందుకు నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముట్టడికి వచ్చిన విద్యార్థులు, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తొలివెలుగుతో మాట్లాడిన బల్మూరి వెంకట్.. సబితా ఇంద్రారెడ్డిపై మండిపడ్డారు. ఇంత జరిగినా మంత్రి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.