టెట్ పరీక్ష తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ధర్నాకు దిగారు. టెట్ పరీక్ష నిర్వహిస్తున్న జూన్ 12 తేదీన ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉందని.. టెట్ వాయిదా వేయకుంటే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి సబితకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రెండు అంశాలపై వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. దీంతో నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వెంకట్ సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనిపై స్పందించిన మంత్రి సబిత.. పరీక్షను వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. టెట్ పరీక్ష వాయిదా వేయకుంటే అనేక మంది అభ్యర్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఆర్16 బ్యాచ్ పరీక్షా పేపర్లు మూల్యాంకనం సమయంలో కాలిపోయినప్పటి నుండి వాటిపై ఎలాంటి స్పందన లేకుండా పోయిందని ఆరోపించారు. దీంతో విద్యార్ధులు అనేక అవకాశాలను కోల్పోతున్నారని గుర్తు చేశారు వెంకట్.
మంత్రి అపాయింట్ మెంట్ కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఆర్‌ఆర్‌బీ పరీక్ష వాయిదా చేయడం సాధ్యం కాదని.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ పరీక్షను మరో తేదీకి మార్చాలని కోరారు. టెట్ అభ్యర్థుల పక్షాణ మంత్రిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చిన తమను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు వెంకట్.