హన్మకొండ జిల్లా కమలాపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగలుతూనే ఉంది. ముందు ఏబీవీపీ నేతలు రెండు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గూడూరులో కస్తూర్భా విద్యాలయంలోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఎన్ఎస్ యూఐ నేతలు ఒక్కసారిగా కాన్వాయ్ మధ్యలోకి దూసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు ఐదు నిముషాల పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు నిలువరించారు. అయితే.. అదే సమయంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈక్రమంలో కొందరు ఎన్ఎస్ యూఐ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఇటు.. కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్తున్న క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలో దిగి నిరసనకారులను లాగిపడేశారు. ముందు బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని వచ్చిన ఆందోళనకారులు కేటీఆర్ కాన్వాయ్ దగ్గరకు రాగానే కాషాయ జెండాలను బయటకు తీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులను సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ కాలితో తన్నడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.