ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది కానీ, సమస్య మూలాల్ని వెతికే ప్రయత్నం చేయకుండా వదిలేసింది. పునాదులు కదిలిపోయే ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నప్పటికీ విద్యార్ధుల్లో కోపాగ్ని ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నం చేశాయి.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ‘విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించాం’ అని ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి చెప్పారు. రీ కరెక‌్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి విద్యార్ధులు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని చెబుతోందని దుయ్యబట్టారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నాయని తాము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని బలమూరి చెప్పారు.
‘ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలి’ అని విద్యార్ధి సంఘాల నేతలు కోరుతున్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్‌ఎస్‌యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు.