సంచలనం రేపిన అమ్నేషియా పబ్ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి డ్రామా చేస్తున్నాయని.. అందులోభాగంగానే రఘునందన్ ఫోటోలు, వీడియోలు బయటపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రఘునందన్ క్షమాపణ చెప్పాలని.. ఎన్‌ఎస్‌యూఐ నిరసనకు దిగింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.
బాధితురాలి ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేసి బాధిత కుటుంబాన్ని మనోవేదనకు గురిచేశారని మండిపడ్డారు ఎన్‌ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. కేసులోని బాధితురాలి అశ్లీల చిత్రాలను బహిర్గతం చేయొద్దనే కనీస జ్ఞానం లేకుండా రఘునందన్ రావు మీడియా ముందు వాటిని బహిర్గతం చేయడం సిగ్గుచేటని అన్నారు.
బాధితురాలి కుటుంబ పరువుకు భంగం కలిగించిన రఘునందన్ రావుపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ఎమ్మేల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.