గురువారం తెల్లవారుజామున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అట్టుడికింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో ఎన్ఎస్ యూఐ ఆద్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆద్వర్యంలో గురువారం ఉదయం 5.30 గంటలకు తెలంగాణ ఎన్ఎస్ యూఐ బృందం రాజ్ భవన్ ను ముట్టడించింది.
ప్రతిపక్ష నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు వెంకట్. ఇది బీజేపీ దమన నీతంటూ ఆయన నిప్పులు చెరిగారు. కేంద్రం చేస్తున్నా అక్రమాలను ఎత్తిచూపినందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఈ మేరకు రాజ్ భవన్ గేటు వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ భారిగా మోహరించిన పోలీసులు.. నిరసన కారులను అరెస్ట్ చేశారు. బల్మూరి వెంకట్ సహా పలువురు ఎన్ఎస్యూఐ నాయకులను పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు.