పార్లమెంట్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రగిలిపోతోంది. నాయకులు ఒక్కొక్కరుగా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతున్నాయి. నిజాం కాలేజ్ ముందు మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు ఎన్ఎస్‌యూఐ నేతలు.
రాజ్యసభలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్. కాంగ్రెస్ హయాంలో చేసిన తెలంగాణ రాష్ట్ర విభజన తీరు వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదనున్నారు.
మోడీ క్షమాపణలు చెప్పాలని లేకపోతే.. బీజేపీ నేతలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనా దాడులు చేస్తామని హెచ్చరించారు వెంకట్. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్న ఎన్ఎస్‌యూఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.