టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయనుందని అధికారికంగా వెల్లడించారు. సోమవారం జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా.. ‘ఎన్టీఆర్ 30’ మూవీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై జాన్వీ స్పందిస్తూ.. ‘ఈ ప్రాజెక్ట్ లో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఫైనల్ గా ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు వెయిట్ చేస్తున్నా’ అని తెలిపింది. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తెలిపింది జాన్వీ.
ఈ సినిమాని ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభించాలని ఎన్టీఆర్, కొరటాల శివ ప్లాన్ చేశారు. కానీ నందమూరి తారకరత్న మరణం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్న విధంగా మొదలు కానుందని తెలుస్తోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు.
హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు.