హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. హీరోలు సినిమాల్లో చేసే సాహస కార్యాలు, ఫైట్లు, డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ చప్పట్లు కొడుతుంటారు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం హీరోలను విమర్శిస్తారు. అయితే యాంటీ ఫ్యాన్స్ లో ఇంకో రకం ఉంటారు. వారు హీరోల లూప్ హోల్స్ పసిగడతారు. అలాంటి వారు సమయాన్ని చూసి హీరోల నుంచి సహాయం ఆశిస్తుంటారు. అవును.. తారక్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగినట్లు తెలుస్తోంది.
ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు… యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఆ మూవీకి మొదటి రోజు మొదటి షో టిక్కెట్లు దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అందుకు చాలా కష్టపడాలి. కొద్దిగా లక్ కూడా ఉండాలి. కానీ ఇవేవీ అవసరం లేదనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఓ యాంటీ ఫ్యాన్ తారక్‌కు సహాయం చేసి ఆయన నుంచి ఆ మూవీకి మొదటి రోజు మొదటి షోకు టిక్కెట్లు కావాలని కోరాడు.
ఇటీవలే ఎన్‌టీఆర్ రహదారిపై వేగంగా వెళ్తుంటే స్పీడ్ ఎక్కువుందని చెప్పి ఓ ట్రాఫిక్ పోలీస్ వాహనానికి చలాన్ రాశాడట. అయితే ఆయన వద్ద స్పాట్‌లో డబ్బులు లేకపోవడంతో ఓ యాంటీ ఫ్యాన్ ఆ ట్రాఫిక్ చలాన్ మొత్తం రూ.1035 చెల్లించాడట. అయితే సహాయం చేశాక ఆ యాంటీ ఫ్యాన్ తారక్‌ను ట్రిపుల్ ఆర్ మూవీకి మొదటి రోజు మొదటి షోకు టిక్కెట్లు కావాలని, అది కూడా మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలోనే టిక్కెట్లు కావాలని కోరాడట. అయితే ఇందుకు తారక్ ఎలా స్పందించాడన్న వివరాలు బయటకు రాలేదు. కానీ మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరేమో సదరు యాంటీ ఫ్యాన్ తెలివికి మెచ్చుకుంటుంటే.. ఇంకొందరు అతన్ని విమర్శిస్తున్నారు. ఇక కొందరైతే టిక్కెట్లను ఈ విధంగా కూడా సాధించవచ్చన్నమాట.. అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.