నటి మీరా చోప్రా, నటుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. దాదాపు రెండేళ్ల నుంచి వీళ్ల మధ్య వైరం ఉంది. అల్లు అర్జున్ ఎలాగైతే చెప్పను బ్రదర్ అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడో.. అదే విధంగా మీరా చోప్రా కూడా ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ అతడి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అప్పట్లో అభిమానులకు, మీరా చోప్రాకు మధ్య గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
ఆ గొడవంతా సద్దుమణిగింది. ఇక అంతా లైట్ అనకున్న టైమ్ లో మీరా చోప్రా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కెలికింది. రీసెంట్ గా ఓ ట్వీట్ పెట్టింది మీరా చోప్రా. సౌత్ నటులు, పాన్ ఇండియా హీరోలుగా మారడం చాలా ఆనందంగా ఉందని, ఇన్నాళ్లకు వాళ్లకు గుర్తింపు లభించిందంటూ పోస్ట్ పెట్టింది. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
పోస్టు పెట్టిన మీరా చోప్రా.. రామ్ చరణ్, ప్రభాస్, యష్, అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. కానీ అందులో ఎన్టీఆర్ పేరు లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలుగా నటించారు. కానీ మీరా చోప్రా మాత్రం చరణ్ పేరు పెట్టి ఎన్టీఆర్ పేరు వదిలేసింది. దీంతో తారక్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
దీంతో మరోసారి మీరా చోప్రాపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్ ను ఎందుకు కోట్ చేయలేదని కొందరు తిట్ల దండకం అందుకున్నారు. మీరా చోప్రా లాంటి సి-గ్రేడ్ నటి ఎన్టీఆర్ ను గుర్తించాల్సిన అవసరం లేదంటూ మరికొందరు స్పందించారు. ఓవైపు ఇలా ట్రోలింగ్ నడుస్తుండగానే.. మీరా చోప్రా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టింది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉందంటూ ట్వీట్ చేసింది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులో కోపం రెట్టింపు అయింది. గతంలో తనపై ట్రోలింగ్ నడిచినప్పుడు ఓవర్ గా రియాక్ట్ అయిన మీరా చోప్రా.. ఈసారి మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ను తేలిగ్గా తీసుకుంది. ఆమె అస్సలు రియాక్ట్ అవ్వడం లేదు.