కొంతమంది అంతే…! చెరగని ముద్ర వేసి పోతారు. చిరస్థాయిగా ‘నిలిచి’ పోతారు. వాళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా, ఏది తలపెట్టినా తరువాత తరానికి చరిత్రగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి ప్రభావ వంతుల జాబితాలోనందమూరి తారకరామారావు ఒకరు. విద్యార్థిగా,ఉద్యోగిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా మహామనిషిగా సువర్ణాక్షరాలు లిఖించారు. తెలుగు దేశాని(రాష్ట్రాని)కి,తెలుగు భాషకి,తెలుగు సంస్కృతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. శిరోధార్యం.
కొందరు మాములుగా పుట్టి గొప్పవాళ్ళవుతారు.ఆయన పుట్టడమే గొప్పవాడిగా పుట్టాడు అనుకోవాలి. అవును కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలంతే..!ఆయన విద్యార్థి దశనుంచి చదువులో ముందుండేవారు.
అందుకే 1100 మంది రాసిన మద్రాసు సర్వీస్ కమీషన్ లో 7 వ ర్యాంక్ సాధించి మంగళ గిరిలో సబ్ – రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని సంపాదించారు. చిత్రలేఖనంలో సైతం రాష్ట్రస్థాయి ప్రైజులు సాధించారు.
ఆయన మాటే కాదు చేతి రాత కూడా ముత్యాల్లా ఉంటుందని మనలో ఎంత మందికి తెలుసు?! ఎన్టీఆర్ కు తెలుగు భాషకు విడదీయలేని బంధముందని అంతరికీ తెలిసిందే.
తాజాగా ఆయన రాసిని ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూస్తే ఆయన నటనకే కాదు చేతిరాతకు కూడా ఫ్యాన్ కావాల్సిందే.!ముత్యాల్లాంటి అక్షరాలు,చిన్నతప్పు కూడా దొర్లని వాఖ్య నిర్మాణం,పఠిష్టమైన భావం, ప్రేక్షకులపై ఆయనకుండే అక్కర .. వెరసి ఆ అక్షరాల్లో శిల్పంలా కనిపించింది. విజయ చిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు రాసిన లేఖ అది.
మూడు పేజీల నిడివి ఉన్న ఆ లేఖ షూటింగ్ గ్యాప్ లో అలవోకగా రాసినదంటే మనకసలు నమ్మకం కూడా కుదరదేమో…చెప్పుకున్నాం కదా. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలంతే..! మీకోసం ఆలేఖ..!! తనివితీరా చదవండిక.!