తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అంతేకాకుండా నందమూరి రామకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఏపీ, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 28 2023 వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. అందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఉన్నారని వివరించారు పురందేశ్వరి.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పోర్ట్ ల్యాండ్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అందజేస్తోన్నకుట్టుమిషన్లు, అర్హులైన వారికి వీల్ ఛైర్లు, దుప్పట్లను ఎన్టీఆర్ ఘాట్ వద్ద అందజేశారు పురందేశ్వరి. మీతో ఉన్న వారిలో పది మందికి సాయం చేయండని ఆయన ఎప్పడూ చెప్తుండే వారని గుర్తుచేసుకున్నారు. ఆయన కోరిక మేరకు అభాగ్యులకు సాయం చేయడమే ఆయనకు అందిస్తున్న ఘన నివాళి అని తెలిపారు.
ఎన్టీఆర్ నాకు దేవుడు లాంటి వారని భావోద్వేగానికి గురయ్యారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. ఆయన పెట్టిన బిక్ష వల్లే నేడు ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నానని తెలిపారు. ఆయన ద్వారానే మద్రాస్ ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యానని చెప్పారు. సమాజమే దేవాలయం అన్న గొప్ప మనిషి తాను అని కొనియాడారు. కళ్లకు కనపడే దేవుడాయన అని అన్నారు. పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని అంటూనే కంటనీరు పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.