ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వచ్చేసింది. వచ్చి వారం దాటిపోయింది కూడా. మరి ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు? అతడి నెక్ట్స్ సినిమా సంగతులేంటి? కొరటాలతో కలిసి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. జూన్ నుంచి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.
నిజానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్రీగానే ఉన్నాడు. అటు కొరటాల కూడా మే నెల నుంచి ఫ్రీ అయిపోతాడు. కానీ జూన్ వరకు సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వాయిదా వేయడం వెనక 2 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి ఎన్టీఆర్ వెయిట్. అవును.. రీసెంట్ గా ఎన్టీఆర్ మళ్లీ బరువు పెరిగాడు. అలా పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం ఈ 2 నెలల టైమ్ ను జిమ్ లో గడపబోతున్నాడు తారక్.
ఇక రెండో కారణం వేసవి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలో వేడి ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో సినిమాను జూన్ నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో అలియాభట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
కొరటాల చాన్నాళ్ల కిందటే ఈ సినిమా వర్క్ పూర్తిచేశాడు. తాజాగా మరోసారి ఇద్దరూ కలిసి కూర్చుకున్నారు. తుది మార్పులు చేసుకున్నారు. జనతా గ్యారేజీ మేజిక్ ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.