ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ రోజురోజుకు దిగజారిపోతోందని, ఏ క్షణంలోనైనా ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అవుతారంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. అటు పలు నియోజకవర్గాల్లో రాజకీయ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జెండాలను ఎగరేసిన అభిమానులు కూడా ఉన్నారు. స్వయంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎదురుగా, ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని ఏర్పాటుచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు. అతడికి రాజకీయాల్లోకి రావాలని ఉందా లేదా? తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చిపెట్టాలని అనిపించడం లేదా? ఎట్టకేలకు ఈ ప్రశ్నలపై స్పందించాడు తారక్.
“చాలామంది నా పొలిటికల్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు. అది నేను చెప్పలేను. ఎందుకంటే, నేను భవిష్యత్ గురించి ఆలోచించను. ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేయడమే నాకు తెలుసు. నా చేతిలో ఉన్న పనిని వంద శాతం పూర్తి చేయడమే నాకు తెలుసు. భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ఊహించలేను, ఆలోచించను కూడా. ప్రస్తుతం ఓ నటుడిగా ఈ ప్రయాణాన్ని అన్ని విధాలుగా ఆస్వాదిస్తున్నాను. నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ప్రస్తుతానికి నాకిది చాలు.”
ఇలా తన రాజకీయ రంగప్రవేశం గురించి స్పందించాడు తారక్. తను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు, అలా అని రానని కూడా చెప్పలేదు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చనే విధంగా స్పందించాడు. రాష్ట్ర విభజనకు ముందు గతంలో ఓసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత తారక్ కు పార్టీలో పూర్తిగా ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో ఎన్టీఆర్ కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అప్పట్నుంచి ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.