ఓర్మాక్స్ మీడియా బాలీవుడ్‌లోని విశ్వసనీయ మీడియా సంస్థల్లో ఒకటి. ఇప్పుడీ మీడియా పోర్టల్, సోషల్ మీడియాలో (ఏప్రిల్ నెల) అగ్ర తెలుగు తారల జాబితాను విడుదల చేసింది. యాదృచ్ఛికంగా, ఇన్నాళ్లూ అగ్రస్థానంలో ఉన్న మహేష్ బాబు ఐదో స్థానానికి పడిపోయాడు. Ormax మీడియా ద్వారా ఎన్టీఆర్, ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచాడు.
టాలీవుడ్ నుండి పాన్-ఇండియా స్టార్లు, ప్రభాస్, అల్లు అర్జున్ వరుసగా 2,3 స్థానంలో నిలిచారు. RRRలో ఎన్టీఆర్ సహనటుడు, రామ్ చరణ్ లిస్ట్‌లో నాల్గవ స్థానంలో ఉండగా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మహేష్ ఐదవ స్థానానికి పడిపోయాడు. పవన్ కళ్యాణ్ 6వ స్థానంలో నిలిచాడు.
మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. నాని, విజయ్ దేవరకొండ ఈ జాబితాలో చిరంజీవి కంటే ముందుకు వచ్చారు. నాని 7వ స్థానంలో, విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలవగా, చిరంజీవి 9వ స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో తమ హీరో అగ్రస్థానానికి చేరుకున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన పోస్టులతో సోషల్ మీడియా నిండిపోయింది, అతని అభిమానులు ట్విట్టర్‌లో ఎన్టీఆర్ పుట్టినరోజు నెల ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ సదరు బాలీవుడ్ మీడియా సంస్థ, ఏ ప్రాతిపదికన ఈ పాపులారిటీని లెక్కించిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఎందుకంటే, ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ లో నటించాడు. దాన్ని ప్రాతిపదికన తీసుకుంటే, చరణ్ ఇంకా ముందుకు రావాలి. పోనీ సినిమాల పరంగా చూసుకుంటే, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. కానీ అతడు రెండో స్థానంలో నిలిచాడు.