ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాధించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ నేపథ్యంలో క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తోన్న తారక్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు.
ఇప్పటికే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ ఏడాది చివరి నుంచే NTR31ను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు చేతిలో ఉండగానే తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆడుకాలమ్, విసారనై, వడా చెన్నై, అసురన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ వేట్రిమారన్ తో జర్నీ చేయనున్నారట ఎన్టీఆర్.
అసురన్ చిత్రం జాతీయ పురస్కారాన్నే అందుకోవడంతో ఈ దర్శకుడు కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ తోనే తారక్ ఓ పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు నడిచాయని.. స్టోరీ నచ్చడంతో తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్టు లీకులు వినిపిస్తున్నాయి.
వేట్రిమారన్ తీసే సినిమాలన్నీ హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. నటుల్ని, ముఖ్యంగా కథానాయకుల్ని చాలా కొత్తగా, డిఫరెంట్‌గా చూపిస్తాడు ఈ దర్శకుడు. గతంలో ఏ దర్శకుడు ప్రయత్నించని రీతిలో హీరోల్ని ప్రెజెంట్ చేస్తాడు. ఇక్కడ తారక్ ఏమో నవరసాలు పండించడంలో దిట్ట.. అలాంటిది తారక్ తో కావాల్సినంత నటనని పిండుకుంటాడు అనుకుంటున్నారేమో కానీ.. ఈ కాంబో మీద అప్పుడే విపరీతమైన బజ్ వచ్చిపడింది. మరి ఈ వార్త నిజమో కాదో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.