ఎప్పటికప్పుడు కెరీర్ లో రిస్క్ చేస్తూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంటాడు కళ్యాణ్ రామ్. ఆయన కెరీర్ అంతా ప్రయోగాల మయం. అలా ప్రయోగాలు చేసి హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. చేతులు కాల్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ హీరో నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం వస్తోంది. దాని పేరు బింబిసార.
చరిత్రకు సంబంధించిన బింబిసారుడి గాధకు ఫిక్షన్ జోడించి, పీరియాడిక్ మూవీగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా. కంటెంట్ పై నమ్మకంతో, తన మార్కెట్ ఎంతనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా భారీగా ఖర్చు చేశాడు.
ఇప్పుడీ భారీ బడ్జెట్ సినిమాకు బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో అంతా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. వాటిని మరింత ముందుకు తీసుకెళ్తూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా రంగంలోకి దించారు.
తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను ఎన్టీఆర్ ప్రత్యేకంగా వీక్షించాడు. అతను పడిన కష్టాన్ని, యూనిట్ చేసిన ప్రయత్నాన్ని మనసారా మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను, బైట్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్.
బింబిసార సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నాన్-థియేట్రికల్ రైట్స్ నుంచే దాదాపు 25 కోట్లు ఆశిస్తున్నారు. కల్యాణ్ రామ్ సినిమాను ఈ రేటు పెట్టి కొనడానికి ఛానెళ్లు ముందుకు రావడం లేదు. అందుకే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రావాల్సిన సినిమాకు బింబిసారను ముడిపెట్టారు. ఎన్టీఆర్ సినిమాను కొనడానికి ముందుకొస్తున్న ఛానెళ్లు, తప్పనిసరిగా బింబిసారను కూడా కొనాల్సిందే. అలా డీల్ లాక్ చేసేలా ప్లాన్ చేశారు.